ఖురాన్ పరిశీలన - ముందుమాట
ఈ రచన ఎందుకొరకు?
ప్రియమైన పాఠక
మిత్రులారా! నేను ఒక సాధారణ ముస్లిం కుటుంబంలో జన్మించి చిన్నప్పటినుంచి మతం అంత
ఎక్కువగా అంటకపోయినా బాల్యంలో కొన్ని సందర్భాలలో మత ఆచారాలు నేర్చుకోవటానికి
ప్రయత్నించి సాధన చేసినవాడను. వయసు పెరుగుతున్న కొద్ది ఆలోచన మతాన్ని విడిచి చదువు
మీద పడింది. అలా నాకు ఇంటర్నెట్ అలవాటు కానంత వరకు జరిగింది. ఇంటర్నెట్ అలవాటు
అయ్యాక నేను జాకీర్ నాయిక్ గారి వీడియోలు చూడటం, మళ్ళీ మళ్ళీ చూడటం, ఇస్లాం మీద
అనుకూల దృష్టి ఏర్పడటం జరిగాయి. అలా ఇస్లాం గురించి చర్చించటానికి, మాట్లాడటానికి
ఎవరైనా కనపడతారేమో అని అన్ని మసీదులకి వెళ్ళేవాడిని. నమాజులకి వెళ్ళే వాడిని. కొంత
మందిని, నా వయసుకి దగ్గరగా ఉన్న వాళ్ళను పలకరించే వాడిని. మానవ సృష్టి ఉద్దేశం,
ఇస్లాం ప్రచారం ఇలా ఆ వీడియోలలో నన్ను ప్రభావితం చేసిన అంశాల గురించి ప్రస్తావించే
వాడిని. ఆసక్తిగా నా చుట్టూ చేరి అందరు వినే వారు. కాని ఏమైనా ప్రశ్నిస్తే మా ఇమాం
గారు ఇలా చెప్పారు, మా ముల్లా గారు ఇలా చెప్పారు దగ్గరికి పోయేది చివరకి సమాధానం.
అసలు వారెవరో చెప్పటం దేనికి మీరే చదివి అర్ధం చేసుకోవచ్చు కదా అని నేను అంటే వారి నుంచి వచ్చే సమాధానం “ఖురాన్ అంటే
పెద్ద పెద్ద ఆలింలు పెద్ద వాళ్ళు చదివే గ్రంధం. మనం అరబ్బీలో చదివితే చాలు. అర్ధం
చేసుకోవలసిన అవసరం లేదు. మనం చదవాలంటే హదీసులు వంటి వాటితో ప్రారంభిస్తే
సరిపోతుంది, అవి అయ్యాక అప్పుడు వెళ్ళాలి ఖురాన్ వద్దకు అనే వారు”. అల చర్చలు
జరుపుతున్న కాలంలో ఒకరు చెప్పారు మీరు ఇస్లాం ప్రచారం గురించి మాట్లాడుతున్నారు
కదా. ఇస్లాం ప్రచారం అభిరుచి కలిగిన వ్యక్తి ఒకరు ఉన్నారు అని చెప్పి వారి
చిరునామా తెలుపటం జరిగినది. నేను వారిని కలవటం వారి ద్వారా ఇస్లాం గురించి
ముస్లిముల గురించి ఎంతో సమాచారం గ్రహించటం జరిగినది. వారితో సంవత్సరం పైగా సాగిన నా
ప్రయాణం, ఇస్లాం మీద అనుకూల దృక్పథం నానాటికి పెంచుకుంటూ ఇస్లాంయే సమస్త సమస్యలకి
పరిష్కారం అని ఆయన భావిస్తుంటే అప్పటికి ఖురాన్ అధ్యయనం చేయని నేను అదే నిజం అయి
ఉంటుంది. అని భావించి ఇస్లాం ప్రచారానికి, ఇస్లాం స్థాపనకు ఆయన చేసే ప్రయత్నాలలో
నా వంతు సహకారం నేను అందించటమే కాక , నేను కూడా కొన్ని ప్రణాళికలు చేసే వాడిని ఆ
ఆశయ దిశగా. ఆ ప్రయత్నాలలోనే వచ్చింది ఈ ధర్మ సందేహం ఫేస్ బుక్ పేజి.
అయితే అప్పటికి నాకు ఉపాధి మార్గం ఏమి లేకపోవటం , కొన్ని విషయాలలో ఇస్లామీయ
విశ్వాసం నాకు ఉపసమనం ఇస్తూన్న కారణంగా నేను అటు ఇస్లాంని పూర్తిగా అధ్యయనం చేయలేక
పోవటం, ఇటు ఉపాధి మీద పూర్తిగా దృష్టి సారించక పోవటం సాగుతుంది. ఇలా కాలం
సాగుతున్న సందర్భంలో కొన్ని అనుకోని పరిస్థితులలో, అనుకోని పరిచయాలతో ఇస్లాం గురించిన ప్రశ్నలు మా గురువుగారు(అదే
నాకు పరిచయం ఆయిన ఆయన, ప్రస్తుతం మరియు ఎప్పటికీ నా సన్నిహితుడు) ఎదురుకోవటం, వాటికి వివరణ
ఇవ్వకపోవటానికి మా గురువు గారు, ఆయన గురువుగారు కూడా సిద్ధం కాకపోవటం నన్ను
ఆలోచనలో పడవేశాయి. ఇస్లాం గురించి ఈ సారి తటస్థ దృక్పథం తో ఆలోచించాను. నేను ఏ
పునాది మీద ఇస్లాం అనే గూడును కట్టుకున్నానో పునఃపరిశీలన చేసాను. నేను ఎన్నుకున్న
పునాది చాల బలహీనమైనది అర్ధం అయింది. నేను కట్టుకున్న గూడు పేక మేడల్లా
కూలిపాయింది. ఇక నేను నిర్ణయించుకున్నాను. ఖురాన్ ను అనుకూల వైఖరి మాని , తటస్థ
వైఖరి తో అధ్యయనం చేసి, వచ్చిన ఫలితాలను
ప్రపంచానికి అందిద్దామని. నేను ఇస్లాం వలన నష్టపోయానని చెప్పను కాని, చూసి చూడని
తనం వల్ల, ఒక విషయం స్వీకరించటానికి సరైన విచారణ చేయక పోవటం వలన, తప్పూ ఒప్పో
తెలియని నిర్ణయాలు తీసుకుని వాటికి ఎంతో విలువైన నా సంవత్సరన్నర పైగా కాలాన్ని
వెచ్చించి వృధా చేశాను. కాబట్టి ఒక విషయాన్ని స్వీకరించాలంటే సరైన విచారణ ఎంతో
ముఖ్యమని గ్రహించిన నేను నా వలె గుడ్డి నమ్మకం ఆధారంగా తమ తమ కాలాన్ని వృథా
చేసుకున్న వారికి, చేసుకుంటున్న వారికి, చేసుకోబోతున్న వారికి నేను ఖురాన్ మీద
చేసే నా పరిశీలన కొంత వరకైనా ఉపయోగ పడుతుంది అనే ఉద్దేశం తో ఈ పరిశీలన ప్రారంభిస్తున్నాను.
కీడెంచి
మేలెంచమన్నారు. ఖురాన్ నా వద్దకు ఒక పుస్తకంగా వచ్చినది. అది ఎవరు రాసారో తెలీదు,
ఎందుకు రాసారో తెలీదు. కాబట్టి ఆ ఉద్దేశాలు ఏమిటా అని పరిశీలించటం కూడా ముఖ్యమే. ఖురాన్ దేవుని నుంచి ముహమ్మద్ ప్రవక్త కి వచ్చిన సందేశంగా చెప్పుకుంటుంది కాబట్టి నిజంగా అలా జరిగిందా లేదా అన్న దిశగా కూడా పరిశీలిస్తాను. అయితే ఈ ఖురాన్ సంపూర్ణ
సత్యం, ధర్మం, న్యాయం, ఇది వైజ్ఞానికంగా కూడా ఎంతో నిక్కచ్చిగా వైజ్ఞానిక సత్యాలను
ఆవిష్కరిస్తుంది అన్న జాకీర్ నాయిక్ లాంటి బోధకుల మాటల వలన నా లాంటి అనేకుల
పరిశీలన లేని గుడ్డి విశ్వాసాన్ని చొరగోన్నది.
కాబట్టి ఈ సందర్భంలో నేను పరిశీలించదలచిన అంశాలు:
తెల్చోకోగలిగిన
- వ్యక్తి, సమాజం, ప్రకృతి గురించి ఖురాన్ ఎం చెప్తుంది? వాటిలో తెల్చుకోగలిగేవి ఏమిటి? తెల్చుకోలేనివి ఏమిటి? వాటిలో సత్యాసత్యాలు, న్యాయాన్యాయాలు ఏమిటి?
- వ్యక్తికి కాని, సమాజానికి కాని, ప్రకృతికి కాని హాని కలిగించే అంశాలు ఎమన్నా ఉన్నాయా?
- ఖురాన్ నిజంగా వైజ్ఞానిక అంశాలను బోధిస్తున్నదా? బోధిస్తే వాటిలో నిజానిజాలు ఏమిటి?
ఈ అంశాలను దృష్టిలో పెట్టుకుని నా పరిశీలన నేడు
ప్రారంభిస్తున్నాను.
పరిశీలనా సాధారణ ఖురాన్ సూరాల క్రమంలో కాకుండా
అవి ఏ క్రమం లో అయితే వెలువడ్డాయని చెప్పపడుతున్నాయో ఆ క్రమం అనుసరించి
సాగిస్తాను. ఎందుకంటే ఆ క్రమం అయితే ఇస్లాం ఆరంభ దశలో ఎలా ఉంది? తరువాత తరువాత ఎం
జరిగింది అన్న దానిలో స్పష్టత ఉంటుంది.
ఖురాన్ లోని సూరాల అవతరణ క్రమం కోసం tanzil.info వెబ్ సైట్ ద్వారా
అందుతున్న సమాచారం ఆధారంగా పరిశీలన ప్రారంభిస్తున్నాను.
ఇంక ఇందులో నేను వాడబోయే ఖురాన్ ఆయతుల అనువాదాలు
askislampedia.com వారి నుంచి కాని, telugu-quran.com వారి నుంచి కాని స్వీకరించి
రాస్తాను.