Sunday, 5 July 2015

Quran Observation - Forword


ఖురాన్ పరిశీలన - ముందుమాట


ఈ రచన ఎందుకొరకు?
ప్రియమైన పాఠక మిత్రులారా! నేను ఒక సాధారణ ముస్లిం కుటుంబంలో జన్మించి చిన్నప్పటినుంచి మతం అంత ఎక్కువగా అంటకపోయినా బాల్యంలో కొన్ని సందర్భాలలో మత ఆచారాలు నేర్చుకోవటానికి ప్రయత్నించి సాధన చేసినవాడను. వయసు పెరుగుతున్న కొద్ది ఆలోచన మతాన్ని విడిచి చదువు మీద పడింది. అలా నాకు ఇంటర్నెట్ అలవాటు కానంత వరకు జరిగింది. ఇంటర్నెట్ అలవాటు అయ్యాక నేను జాకీర్ నాయిక్ గారి వీడియోలు చూడటం, మళ్ళీ మళ్ళీ చూడటం, ఇస్లాం మీద అనుకూల దృష్టి ఏర్పడటం జరిగాయి. అలా ఇస్లాం గురించి చర్చించటానికి, మాట్లాడటానికి ఎవరైనా కనపడతారేమో అని అన్ని మసీదులకి వెళ్ళేవాడిని. నమాజులకి వెళ్ళే వాడిని. కొంత మందిని, నా వయసుకి దగ్గరగా ఉన్న వాళ్ళను పలకరించే వాడిని. మానవ సృష్టి ఉద్దేశం, ఇస్లాం ప్రచారం ఇలా ఆ వీడియోలలో నన్ను ప్రభావితం చేసిన అంశాల గురించి ప్రస్తావించే వాడిని. ఆసక్తిగా నా చుట్టూ చేరి అందరు వినే వారు. కాని ఏమైనా ప్రశ్నిస్తే మా ఇమాం గారు ఇలా చెప్పారు, మా ముల్లా గారు ఇలా చెప్పారు దగ్గరికి పోయేది చివరకి సమాధానం. అసలు వారెవరో చెప్పటం దేనికి మీరే చదివి అర్ధం చేసుకోవచ్చు కదా అని నేను  అంటే వారి నుంచి వచ్చే సమాధానం “ఖురాన్ అంటే పెద్ద పెద్ద ఆలింలు పెద్ద వాళ్ళు చదివే గ్రంధం. మనం అరబ్బీలో చదివితే చాలు. అర్ధం చేసుకోవలసిన అవసరం లేదు. మనం చదవాలంటే హదీసులు వంటి వాటితో ప్రారంభిస్తే సరిపోతుంది, అవి అయ్యాక అప్పుడు వెళ్ళాలి ఖురాన్ వద్దకు అనే వారు”. అల చర్చలు జరుపుతున్న కాలంలో ఒకరు చెప్పారు మీరు ఇస్లాం ప్రచారం గురించి మాట్లాడుతున్నారు కదా. ఇస్లాం ప్రచారం అభిరుచి కలిగిన వ్యక్తి ఒకరు ఉన్నారు అని చెప్పి వారి చిరునామా తెలుపటం జరిగినది. నేను వారిని కలవటం వారి ద్వారా ఇస్లాం గురించి ముస్లిముల గురించి ఎంతో సమాచారం గ్రహించటం జరిగినది. వారితో సంవత్సరం పైగా సాగిన నా ప్రయాణం, ఇస్లాం మీద అనుకూల దృక్పథం నానాటికి పెంచుకుంటూ ఇస్లాంయే సమస్త సమస్యలకి పరిష్కారం అని ఆయన భావిస్తుంటే అప్పటికి ఖురాన్ అధ్యయనం చేయని నేను అదే నిజం అయి ఉంటుంది. అని భావించి ఇస్లాం ప్రచారానికి, ఇస్లాం స్థాపనకు ఆయన చేసే ప్రయత్నాలలో నా వంతు సహకారం నేను అందించటమే కాక , నేను కూడా కొన్ని ప్రణాళికలు చేసే వాడిని ఆ ఆశయ దిశగా. ఆ ప్రయత్నాలలోనే వచ్చింది ఈ  ధర్మ సందేహం ఫేస్ బుక్ పేజి. అయితే అప్పటికి నాకు ఉపాధి మార్గం ఏమి లేకపోవటం , కొన్ని విషయాలలో ఇస్లామీయ విశ్వాసం నాకు ఉపసమనం ఇస్తూన్న కారణంగా నేను అటు ఇస్లాంని పూర్తిగా అధ్యయనం చేయలేక పోవటం, ఇటు ఉపాధి మీద పూర్తిగా దృష్టి సారించక పోవటం సాగుతుంది. ఇలా కాలం సాగుతున్న సందర్భంలో కొన్ని అనుకోని పరిస్థితులలో, అనుకోని పరిచయాలతో  ఇస్లాం గురించిన ప్రశ్నలు మా గురువుగారు(అదే నాకు పరిచయం ఆయిన ఆయన,  ప్రస్తుతం మరియు ఎప్పటికీ నా సన్నిహితుడు) ఎదురుకోవటం, వాటికి వివరణ ఇవ్వకపోవటానికి మా గురువు గారు, ఆయన గురువుగారు కూడా సిద్ధం కాకపోవటం నన్ను ఆలోచనలో పడవేశాయి. ఇస్లాం గురించి ఈ సారి తటస్థ దృక్పథం తో ఆలోచించాను. నేను ఏ పునాది మీద ఇస్లాం అనే గూడును కట్టుకున్నానో పునఃపరిశీలన చేసాను. నేను ఎన్నుకున్న పునాది చాల బలహీనమైనది అర్ధం అయింది. నేను కట్టుకున్న గూడు పేక మేడల్లా కూలిపాయింది. ఇక నేను నిర్ణయించుకున్నాను. ఖురాన్ ను అనుకూల వైఖరి మాని , తటస్థ వైఖరి తో  అధ్యయనం చేసి, వచ్చిన ఫలితాలను ప్రపంచానికి అందిద్దామని. నేను ఇస్లాం వలన నష్టపోయానని చెప్పను కాని, చూసి చూడని తనం వల్ల, ఒక విషయం స్వీకరించటానికి సరైన విచారణ చేయక పోవటం వలన, తప్పూ ఒప్పో తెలియని నిర్ణయాలు తీసుకుని వాటికి ఎంతో విలువైన నా సంవత్సరన్నర పైగా కాలాన్ని వెచ్చించి వృధా చేశాను. కాబట్టి ఒక విషయాన్ని స్వీకరించాలంటే సరైన విచారణ ఎంతో ముఖ్యమని గ్రహించిన నేను నా వలె గుడ్డి నమ్మకం ఆధారంగా తమ తమ కాలాన్ని వృథా చేసుకున్న వారికి, చేసుకుంటున్న వారికి, చేసుకోబోతున్న వారికి నేను ఖురాన్ మీద చేసే నా పరిశీలన కొంత వరకైనా ఉపయోగ పడుతుంది అనే ఉద్దేశం తో ఈ  పరిశీలన ప్రారంభిస్తున్నాను.
                కీడెంచి మేలెంచమన్నారు. ఖురాన్ నా వద్దకు ఒక పుస్తకంగా వచ్చినది. అది ఎవరు రాసారో తెలీదు, ఎందుకు రాసారో తెలీదు. కాబట్టి ఆ ఉద్దేశాలు ఏమిటా అని పరిశీలించటం కూడా ముఖ్యమే. ఖురాన్ దేవుని నుంచి ముహమ్మద్ ప్రవక్త కి వచ్చిన సందేశంగా చెప్పుకుంటుంది కాబట్టి నిజంగా అలా జరిగిందా లేదా అన్న దిశగా కూడా పరిశీలిస్తాను.  అయితే ఈ ఖురాన్ సంపూర్ణ సత్యం, ధర్మం, న్యాయం, ఇది వైజ్ఞానికంగా కూడా ఎంతో నిక్కచ్చిగా వైజ్ఞానిక సత్యాలను ఆవిష్కరిస్తుంది అన్న జాకీర్ నాయిక్ లాంటి బోధకుల మాటల వలన నా లాంటి అనేకుల పరిశీలన లేని గుడ్డి విశ్వాసాన్ని చొరగోన్నది.  
కాబట్టి ఈ సందర్భంలో నేను పరిశీలించదలచిన అంశాలు:
తెల్చోకోగలిగిన
  1. వ్యక్తి, సమాజం, ప్రకృతి గురించి ఖురాన్ ఎం చెప్తుంది? వాటిలో తెల్చుకోగలిగేవి ఏమిటి? తెల్చుకోలేనివి ఏమిటి? వాటిలో సత్యాసత్యాలు, న్యాయాన్యాయాలు ఏమిటి?
  2.  వ్యక్తికి కాని, సమాజానికి కాని, ప్రకృతికి కాని హాని కలిగించే అంశాలు ఎమన్నా ఉన్నాయా?
  3.  ఖురాన్ నిజంగా వైజ్ఞానిక అంశాలను బోధిస్తున్నదా? బోధిస్తే వాటిలో నిజానిజాలు ఏమిటి?
ఈ అంశాలను దృష్టిలో పెట్టుకుని నా పరిశీలన నేడు ప్రారంభిస్తున్నాను.
పరిశీలనా సాధారణ ఖురాన్ సూరాల క్రమంలో కాకుండా అవి ఏ క్రమం లో అయితే వెలువడ్డాయని చెప్పపడుతున్నాయో ఆ క్రమం అనుసరించి సాగిస్తాను. ఎందుకంటే ఆ క్రమం అయితే ఇస్లాం ఆరంభ దశలో ఎలా ఉంది? తరువాత తరువాత ఎం జరిగింది అన్న దానిలో స్పష్టత ఉంటుంది.
ఖురాన్ లోని సూరాల అవతరణ క్రమం కోసం tanzil.info వెబ్ సైట్ ద్వారా అందుతున్న సమాచారం ఆధారంగా పరిశీలన ప్రారంభిస్తున్నాను.
ఇంక ఇందులో నేను వాడబోయే ఖురాన్ ఆయతుల అనువాదాలు askislampedia.com వారి నుంచి  కాని, telugu-quran.com వారి నుంచి కాని స్వీకరించి రాస్తాను.

Monday, 29 June 2015

Questioning Islam -1


ఇస్లాం మరియు నేను-1

                 ప్రియమైన పాఠక మిత్రులారా! ఇదే వ్యాసాన్ని ‘దేవుడు మరియు నేను’ అనే పేరుతో ప్రారంభించవచ్చు. కాని ఇస్లాం ఎందుకు వాడవలసి వస్తుంది అంటే ఆ దేవుడిని ఒక్కొక్క ఆధ్యాత్మిక మార్గం ఒక్కొక్క విధంగా నిర్వచిస్తున్నాయి. కొన్ని మార్గాలలో దేవుడు అంటే కేవలం కష్టాలు తీర్చే, లాభం చేకూర్చే అతీత శక్తి, కొన్ని మార్గాలలో సృష్టికర్త, కొన్ని మార్గాలలో ఆదర్శపురుషుడు. దేవుడు అనే పదానికి అసలు అర్ధం ఏమిటో నాకు తెలీదు కానీ, వాడుకలో వివిధ అర్ధాలతో దేవుడు అనే పదాన్ని వాడుతున్నారు కాబట్టి, ఇస్లాం దేవుడిని ఎలా నిర్వచిస్తుందో, ఏ విధంగా వివరిస్తుందో అదే నా వ్యాసపు ఆసక్తి కాబట్టి ఈ వ్యాసానికి “ఇస్లాం మరియు నేను” అని పేరు పెట్టాను.

                ఇంక అసలు విషయానికి వస్తే ఖురాన్ తనని తాను దేవుని వద్ద నుండి వచ్చిన సందేశంగా ప్రకటించుకుంటుంది. మరియు ఖురాన్ ప్రకారం దేవుని నిర్వచనాలలో ఒకటి సృష్టికర్త. సృష్టికర్త నిజంగా ఉన్నాడా? లేడా? అన్నది మన పరిమితులలో లేని చర్చ. సృష్టికర్త లేడు అనుకుంటే అసలు ఇస్లాం గురించి, దేవుడి గురించి చర్చలే అనవసరం. నేను సృష్టికర్తని వెతుకుతున్నాను. ఉన్నాడేమోనని. ఉంటే నా కొన్ని ప్రశ్నలకు సమాధానాన్ని ఇస్తాడేమో అని. ఖురాన్ దేవుని సందేశంగా ప్రకటించుకుంటుంది కాబట్టి ఇంక ఖురాన్ నే అడుగుతాను న ప్రశ్నలు.

*దేవుడా.. అసలు నన్నెందుకు పుట్టించావు? ఇది నా ప్రశ్న. దీని సమాధానం కోసం ఖురాన్ ని వెతకటం ప్రారంభిస్తే పుట్టించడం మీద దాదాపు 58 రెఫెరెన్సులు లభించాయి. ఇక వాటిని వరుసగా చదవనారంభించాను. కొన్నిటిని ఇక్కడ రాసాను.

7:179 “ఎంతోమంది జిన్నులను, మానవులను మేము నరకం కోసం పుట్టించాము”
--‘నన్ను కూడానా? ఎంతో మంది అన్నాడు కాని అందరిని అనలేదుగా.. కాబట్టి నేను నరకం కోసం కాకపోయి ఉండొచ్చేమో. కాని నరకం కోసం పుట్టించినపుడు అసలు భూమి మీదకి దేనికి పంపటం? డైరెక్ట్ గా నరకంలోనే వేసేయ్యోచ్చుగా’

1౦:4-“ నిస్సందేహంగా ఆయనే తొలిసారి పుట్టిస్తాడు, మరి విశ్వసించి, మంచిపనులు చేసిన వారికి న్యాయసమ్మతంగా పుణ్యఫలం ప్రసాదించేందుకు మలిసారి పుట్టించేవాడు కూడా ఆయనే. సత్యాన్ని తిరస్కరించిన వారికి వారి తిరస్కారవైఖరి మూలంగా త్రాగటానికి సలసలాకాగే నీరు, బాధాకరమైన శిక్ష ఉంటుంది.”
--‘ఇక్కడ మలిసారి ఎందుకు పుట్టిస్తారో చెప్పబడింది. మరి తొలిసారి ఎందుకు పుట్టించబడ్డాను అనేదిగా నా బాధ. చూద్దాం మున్ముందు ఎక్కడన్నా దొరుకుతుందేమో.’

11:119-“ "నేను నరకాన్ని జిన్నాతులు, మనుషులు అందరితోనూ నింపుతాను" అని నీ ప్రభువు అన్నమాట నెరవేరింది.”
--‘అయ్యో అందరితోను అన్న మాట రానే వచ్చేసిందే. అయితే అది అనువాద లోపం ఏమో.. సరే నా అసలు ప్రశ్నకి సమాధానాన్ని వెతికే పని కొనసాగిద్దాం.’

2౩:115-“మేము మిమ్మల్ని ఏదో ఆషామాషీగా (అర్థరహితంగా) పుట్టించామనీ, మీరు మా దగ్గరకు మరలిరావటం అనేది జరగని పని అని అనుకున్నారా?
--‘అదేగా నా బాధ.. ఆషామాషీగా పుట్టించి ఉండరు. కచ్చితంగా ఎదో ఒక కారణం ఉంటుంది అనే కదా వెతుకుతుంది..’

౩8:27-“ మేము భూమ్యాకాశాలను, వాటి మధ్యనున్న వాటిని లక్ష్య రహితంగా పుట్టించలేదు. ఇది అవిశ్వాసుల ఆలోచన మాత్రమే. కాబట్టి అవిశ్వాసులకు (నరక) అగ్ని నుండి వినాశం తప్పదు.”
--‘హమ్మయ్య! లక్ష్యం లేకుండా పుట్టించలేదట. మళ్ళీ పునరుద్ఘాటించారు.’

76:2-“ నిశ్చయంగా మేము మానవుణ్ణి పరీక్షించడానికి ఒక మిశ్రమ వీర్య బిందువుతో పుట్టించాము. మరి మేము అతణ్ణి వినేవాడుగా, చూసేవాడుగా చేశాము.”


--‘దేవుడా.. ఇప్పుడు వచ్చింది అసలు పాయింట్. దేవుడు నన్ను పరీక్షించటానికి సృష్టించాడన్న మాట. అంటే నా జీవిత పరమార్థం, జీవిత లక్ష్యం ఈ పరీక్షలో నెగ్గటం అన్న మాట. అయితే పరీక్ష ఏ విషయంలో అనేది తెలిస్తే ఆ విషయాలలో తప్పులు చేయకుండా జాగ్రత్త పడవచ్చు. కాని అంత కన్నా ముందుగా సమాధానం తెలుసుకోవలసిన ఒక ముఖ్యమైన ప్రశ్న ఉంది. అది ఏమిటంటే దేవునికి పరీక్షించవలసిన అవసరం ఏమిటి? ఈ పరీక్ష పెట్టడంలో దేవుని యొక్క ఉద్దేశం ఏమిటి? ఎందుకు ఈ ప్రశ్నలు ముఖ్యమంటే ఈ పరీక్ష పెట్టాలన్న ఆలోచనే నేను పుట్టటానికి కారణం అంటుంది ఖురాన్.  ప్రశాంతంగా శూన్యంగా ఉన్న నన్ను ఈ గందరగోళపు ప్రపంచంలోకి లాగిపడేసిన ఆలోచనకు కారణమైన ఉద్దేశం తెలుసుకోవటం నాకు ఎంతో ముఖ్యం.’


అందుకే ముందు పరీక్ష గురంచి కొన్ని ఆలోచనలు పంచుతాను:
పరీక్ష : ఒక వ్యక్తి యొక్క సమర్థతను అంచనా వేయుట కొరకు నిర్వహించబడే ప్రశ్నలు/అభ్యాసాలతో కూడిన ప్రక్రియ.
అంటే పరీక్ష యొక్క సర్వ సామాన్య ఉద్దేశం సమర్థతను అంచనా వేయటం. ఏ విషయంలో అంచనా వేస్తున్నాం అన్న దాన్ని బట్టి పరీక్ష విధానం మారుతుంది.


మరింత చర్చించే ముందు పరీక్ష ఏ విషయంలో అన్న దాని గురించి ఖురాన్ ఎమన్నా చెప్తుందా వెతుకుదాం:
మొత్తం 6౩ రెఫెరెన్సులు దొరికాయి. చూద్దాం అందులో ఎక్కడన్నా పరీక్ష ఏ సమర్థతను తెలుసుకోవటానికి అన్న  విషయం దొరుకుతుందేమో..

11:7-“ మీలో మంచి పనులు చేసే వారెవరూ పరీక్షించే నిమిత్తం ఆయన ఆరు రోజులలో ఆకాశాలనూ, భూమినీ సృష్టించాడు.”
--‘అంటే మంచి పనులు చేసే సమర్ధతను పరీక్షించటానికా ఈ పరీక్ష? చూద్దాం ఇంకేమన్నా వస్తాయేమో..’

18:7-“జనులలో ఎవరు మంచి పనులు చేస్తారో పరీక్షించే నిమిత్తం మేము భూమండలంలో ఉన్న దాన్నంతటినీ భూమికి శోభాయమానంగా చేశాము.”
--‘మళ్ళీ అటువంటి వాక్యం వచ్చింది.’

21:111-“బహుశా ఇది మీకొక పరీక్ష కాబోలు! ఒక నిర్ణీత గడువు వరకు లబ్ది (చేకూర్చటం) దీని ఉద్దేశం కాబోలు! ఇది కూడా నాకు తెలియదు.”
--‘ ఎందుకంత అనుమానంగా చెప్తున్నారు అన్న విషయం నాకు అర్ధం కాలేదు.’

67:2-“మీలో మంచి పనులు చేసేవారెవరో పరీక్షించే నిమిత్తం ఆయన చావుబతుకులను సృజించాడు. ఆయన శక్తిశాలి, క్షమాశీలి కూడాను.”

పై వాక్యాలను బట్టి ఈ విషయం కోసమే మిమ్మల్ని సృష్టించాను అని స్పష్టంగా తెలియపరచాకపోయినా, మంచి పనులు చేసే వారెవరో తెలుసుకొనుటకు పరీక్షిస్తున్నట్లు కొంత సమాచారం అందుతుంది.

అయితే నా ప్రశ్న ఏమిటంటే మంచి పనులు చేసే సమర్ధత దేవుడు తెలుసుకోవాలనుకుంటే దానికి పరీక్ష అవసరమా? నేడు ఒక మనిషే ఎదుటి వ్యక్తిని అతని మాటలని బట్టి, అతని చేష్టలను బట్టి అతను ఎటువంటి పనులు చేస్తాడు అన్న విషయాన్నీ అంచనా వేసేస్తాడు కదా.. మరి మనిషిని సృష్టించిన దేవుడికి మనిషికి అన్ని రకాల సమర్థతలు, గుణాలు ఇచ్చిన దేవునికి, ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క ప్రత్యేక స్వభావాన్ని ఇచ్చే దేవునికి(౩౦:౩౦) ఏ సందర్భం లో ఎలా ప్రవర్తిస్థాడో పసిగట్టలేడా? ఒక సాధారణ మనిషే ఎదుటి వ్యక్తిని ఎలా అంచనా వేయగలడో ఈ ఖురాన్ వాక్యం చెప్తుంది.

47:౩౦-“మేము గనక తలచుకుంటే వారందరినీ నీకు చూపి ఉండేవారము. నువ్వు వాళ్ళ ముఖ కవళికలను బట్టి వాళ్లను పసిగట్ట గలిగేవాడివి. అయినప్పటికీ నువ్వు వాళ్లను వాళ్ల మాటల తీరును బట్టి తెలుసుకోగలవు. మీ కార్యకలాపాలన్నీ ఆ ఆరాధ్య దైవంకు తెలుసు సుమా!”

మరి దేవుడు సర్వ సృష్టికర్తకు, సర్వశక్తిమంతునికి పరీక్షించవలసిన అవసరం లేదు అంటాను నేను. ఒకవేళ పరీక్షించి తప్ప ఒకరి సమర్ధత అంచనా వేయలేకపోతే అతను సర్వసృష్టికర్త, సర్వశక్తిమంతుడు కాడు అంటాను. ఉదాహరణకు ఒక శాస్త్రవేత్త ఒక ప్రయోగం చేసి ఒక కొత్త వస్తువు కనిపెడితే అతను దాన్ని తప్పకుండ పరీక్షిస్తాడు. ఎందుకంటే అతను ఆ వస్తువుకు సంబంధించిన సర్వాన్ని సృష్టించలేదు కాబట్టి, అందులో ఉన్న సమస్తం యొక్క లక్షణాలు సంపూర్తిగా తెలియవు కాబట్టి. కాని ప్రతి వస్తువును, దాని యొక్క లక్షణాలను కూడా నిర్దేశించిన ఆ సర్వసృష్టికర్త మాత్రం ఏ మాత్రం పరీక్షించకుండా ఫలితాలను అంచనా వేయగలడు. ఖురాన్ ప్రకారం దేవుడు సర్వశక్తిమంతుడు, సర్వసృష్టికర్త. మరియు అదే ఖురాన్ ప్రకారం దేవుడు పరీక్షిస్తున్నాడు. కాబట్టి నేను దీన్ని ఖురాన్ లోని పరస్పర వైరుధ్యమైన విషయంగా భావిస్తున్నాను. ఈ వ్యాసంలో, నా ఆలోచనా సరళిలో ఏమైనా లోపాలు ఉంటె తెలియజేయండి. ఇంకా ఈ వ్యాసం పై మీ అభిప్రాయాలు తెలియజేయండి.